ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు... ఆరంభం
ప్రత్యేక హోదా కోసం ఆత్మ గౌరవ మహా ప్రతిజ్ఞ పట్టణాలు, గ్రామాల్లో పనులు చేసుకుంటూనే నిరసన
- జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ పిలుపు
విజయవాడ:
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ఇదే సిసలైన ఆరంభం అని జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. హోదాని సాధించేందుకు నాలుగుసార్లు మన ఎంపీలకు అవకాశం వచ్చినా, పార్టీలు వాటి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టాయని విమర్శించారు. రాష్టపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపుడు మన ఎంపీలు ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేకపోయారని జేడీ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీగా మన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా కల్పించి ఉంటే, పారిశ్రామిక అభివృద్ధి జరిగి, నిరుద్యోగులకు ఉపాధి దొరికేదన్నారు. ఈ ఎన్నికల సమయంలో కేంద్రానికి ప్రత్యేక హోదా డిమాండును వినిపించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తోందని జేడీ తెలిపారు.
విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా బ్యాడ్జీని ధరించి, ఉద్యమ నినాదాలు చేశారు. పొట్టి శ్రీరాములు బొమ్మతో కూడిన బ్యాడ్జీ ధరించి, అందరితో ప్రత్యేక హోదా ఆత్మగౌరవ మహా ప్రతిజ్ఞ చేయించారు. వచ్చే ఎన్నికల్లో మీ ఇంటికి ఓట్లు అడిగేందుకు వచ్చిన ప్రతి పార్టీ నాయకుడిని, ఈ బ్యాడ్జీ ధరించి ఆత్మగౌరవ మహా ప్రతిజ్ఞ చేయమని చెప్పాలని పిలుపునిచ్చారు. జనవరి 26, 2024న ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రులంతా కలిసి సమైక్యంగా ప్రత్యేక హోదా ప్రతిజ్ణ చేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదాను సాకారం చేయడంలో అటు కేంద్ర బీజేపీ, ఇటు రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ ఎంపీలు విఫలం అయ్యారని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదని, కేంద్ర బీజేపీ చెపుతూ, ఆంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. పోర్టేట్ ఆఫ్ పవర్ గ్రంధకర్త ఎన్.కె.సింగ్ ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ లు అడ్డంకి కాదని తేల్చి చెప్పారని వివరించారు. తక్షణం గ్రామగ్రామాన ఆంధ్రులు ప్రత్యేకహోదా సాధన కోసం ఆత్మగౌరవ మహాప్రతిజ్ఞ చేయాలని జేడీ పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ మహాప్రతిజ్ఞ చేసేందుకు నిరాకరించిన పార్టీలకు, నాయకులకు ఓటు వేయబోమని కర్కశంగా చెప్పాలన్నారు. ఈ కార్యాచరణ విషయమై చర్చించేందుకు తాను అందరికీ అందుబాటులో వుంటానని జేడీ అన్నారు.
విద్యార్థులు, యువత, అధ్యాపకులు, హెయిర్ కటింగ్ సెలూన్స్, కిరాణ కొట్లు, పూలు, పండ్లు,కూరగాయల కొట్లు, టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఆటో క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ జోమాటో, ర్యాపిడో, ఓలా రైడర్లు, బ్యూటీ పార్లర్లు ఇలా అందరూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోతిన వెంకట రామారావు, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాస్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేకే జలీల్, జన సహాయక శక్తి సంఘం షేక్ ఉమర్ షాపా, ఆప్ జిల్లా అధ్యక్షుడు పరమేష్, రాష్ట్ర నాయకులు జి.ఫణి రాజ్ తదిరులు పాల్గొన్నారు.
Comments