ఎన్నికల వేళ! తమ్ముళ్ళూ స్పీడ్ వద్దు..సేఫ్ రైడ్
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ పిలుపు
విజయవాడ: ఎన్నికల వేళ! తమ్ముళ్ళూ స్పీడ్ వద్దు. సేఫ్ రైడ్ చాలా ముఖ్యం అంటూ, ఐపిఎస్ విశ్రాంత అధికారి వి.వి.(జేడీ)లక్ష్మీనారాయణ యువతకు జాగ్రత్తలు చెప్పారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించక, ఏటా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని బి.ఆర్.టి.ఎస్. రోడ్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బండిపై హెల్మెట్ ధరించి, లక్ష్మీనారాయణ స్వయంగా సేఫ్ రైడ్ చేశారు. ఇందులో పలువురు యువకులు హెల్మెట్ ధరించి బుల్లెట్ బండ్లపై ఆయనను అనుసరించారు. స్థానిక ఫుడ్ జంక్షన్ నుంచి పడవల రేవు వరకు బి.ఆర్.టి.ఎస్. రోడ్డుపై ఆయన సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఏటా 4.60 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని, ఇందులో అత్యధికం యువత, మధ్య వయస్కుల వారే ఉండటం బాధాకరమన్నారు. దేశ మానవ వనరుల్లో యువత కీలకమని, వారి భద్రత మన బాధ్యత అని లక్ష్మీనారాయణ చెప్పారు. వచ్చే ఎన్నికల సీజన్లో యువత జాగ్రత్తగా ఉండాలని, బైక్ లపై స్పీడుగా వెళ్ళి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీలో జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, పార్టీ నాయకులు దక్షిణామూర్తి, లీగల్ వింగ్ ప్రెసిడెంట్ మహంత్ నాయర్, ఎన్.టి.ఆర్. జిల్లా కన్వీనర్ బి.వసుంధర, కార్యదర్శి ఎం.అరుణ, రాధికా శ్రీధరన్, ఐ.విజయ దుర్గ, కె.బాల చాముండేశ్వరి, బెజవాడ నాని, తదితరులు పాల్గొన్నారు.
Comments