ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తాం
- జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ
- మ్యానిఫెస్టోను వివరించిన వైనం
- చిన్న చిన్న పార్టీలతో కలిసి పనిచేస్తామని వెల్లడి
- అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్ నిర్వహణ నిర్మాణమే ధ్యేయం
- వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా
- ప్రజల చేతికి ప్రజా పాలన అన్నది మా ధ్యేయం
- రాజకీయం కాదు రాజనీతిజ్ఞత ముఖ్యం
శ్రీకాకుళం నగరం : విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కేందుకు ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు పనిచేయలేక పోయాయి అని, గడిచినపదేళ్లలో అవి ఏమీ
సాధించ లేక పోయాయని, తాము రానున్న ఎన్నికల ముందే ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తామని, దీనిపై ఓ స్పష్టమయిన వైఖరితో, ఉద్యమ కార్యాచరణతో పనిచేయనున్నా మని
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక శ్రీకాకుళం క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ (కల్యాణ మండపం)లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలానే మీడియా మిత్రులతో ముచ్చటించారు. మ్యానిఫెస్టోలోని పలు వివరాలను కూలకుషంగా విశదీకరించారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు (వైసీపీ,టీడీపీ) ప్రత్యేక హోదా విషయాన్ని వదిలేశాయని, ముఖ్యంగా 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు లేవని చెప్పడం తప్పు అని, ఇదే విషయాన్ని 15వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ ఎన్.కె.సింగ్ సైతం తాను రాసిన పుస్తకం పోట్రేయిట్స్ పవర్ లో ప్రస్తావించారు అని తెలిపారు. ఈ విషయమై కేంద్రం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నదని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.
"హోదా విషయంలో టీడీపీ,వైసీపీ రెండూ ప్రజలను మోసం చేశాయి. రేపటి వేళ వీటిపై పోరాటం సాగిస్తూనే మా పార్టీ అధికారంలోకి వస్తే ..అప్పులు లేని ఆంధ్ర రాష్ట్రం నిర్వహణకు నిర్వాణానికి ప్రాధాన్యం ఇస్తాం. ముఖ్యంగా విభజన హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తాం. వాటి సాధనకు ప్రాధాన్యం ఇస్తాం. ఈ క్రమంలో వచ్చే నెల ఒకటో తారీఖున పలు విద్యార్థి సంఘాలు, పలు ప్రజా పోరాట సంఘాలు తలపెట్టిన ఛలో తాడేపల్లి కార్యక్రమానికి మేం మద్దతు ఇస్తున్నాం."
"హోదా విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎన్నికల్లోగానే తాడోపేడో తేల్చుకుంటాం. పోరాడితేనే సత్ఫలితాలు వస్తాయని , ఇందుకు నిర్దిష్ట కార్యాచరణ ముఖ్యం అని మేం భావిస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించబోతున్నాం. ఎన్నికల్లోపు ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు వ్యూహం అమలు చేయనున్నాం. ఇంతవరకూ హోదా విషయమై వైసీపీ కానీ టీడీపీ కానీ ఏం చేశాయని ఈ ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం నుంచి ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా రైతులకు అండగా ఉండబోతున్నాం. రేపటి వేళ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే ఆరువేలు, రాష్ట్రం తరఫున పదివేలు మొత్తం రైతన్నకు ఏడాదికి పదహారు వేల రూపాయలు చేయూత అందించనున్నాం. అలానే స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలుకు కృషి చేయనున్నాం."
"వ్యవసాయ కూలీల ఖర్చుకు కూడా సాయం అందించనున్నాం. రైతుకు సమాజం ఉంటుంది కానీ సామాజిక వర్గం అనేది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. స్వయం పరిపాలన తీసుకుని రావాలన్నదే జై భారత్ పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రతి నియోజక వర్గ అభివృద్ధికీ, వాటిని సంపద సృష్టి కేంద్రాలుగా మలిచేందుకు ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తద్వారా పరిశ్రమల ఏర్పాటు యువతకు ఉపాధి అన్నవి సాధ్యం అవుతాయి."
"మా పార్టీ ప్రజల చేతుల్లోనే ప్రజా స్వామ్యం ఉండాలని భావిస్తోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనీ కూడా ప్రజా కమిటీల ద్వారా నిర్వహించనున్నాం. అవినీతిని నిరోధించగలిగితే మద్యం అమ్మకాల నిషేధం సులభ తరం చేయవచ్చు. ఆ దిశగా మేం అడుగులు వేస్తాం. గ్రామాలలో మహిళల అభిప్రాయం మేరకు మద్యం అమ్మకాల విషయమై వద్దంటే వద్దు అన్న నినాదాన్ని పరిగణనలోకి తీసుకుని, మద్యం అమ్మకాలపై స్పష్టమయిన పర్మిట్ విధానం ఒకటి తీసుకుని వస్తాం.రాజకీయం అంటే సుపరిపాలన అన్నది మా ప్రధానోద్దేశం. రాజకీయం కాదు రాజనీతిజ్ఞత అన్నది ముఖ్యం అని భావిస్తున్నాం. రాజనీతిజ్ఞత అన్నది ఉంటే దేశం మేలు కోసం, ప్రాంతం ప్రయోజనం కోసం పార్టీలకతీతంగా ఓ నాయకుడు మరో నాయకుడు కలిసి పనిచేస్తారు. గతంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవాళ అందుకు భిన్నంగా పార్టీలు ఉన్నాయి. ఇది మంచి పరిణామం కాదు."
"దేశ భవిష్యత్తు,ప్రజల అభ్యున్నతి అన్నవే అంతిమం కావాలి. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా ను. లోక్ సభకు పోటీ చేస్తానా లేదా శాసన సభకు పోటీ చేస్తానా అన్నది పార్టీ నిర్ణయానుసారం ఉంటుంది. జై భారత్ పార్టీ కమిటీ నిర్ణయం ప్రకారం నా కార్యాచరణ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,మహారాష్ట్రల్లోనూ పోటీ చేయనున్నాం" అని చెప్పారాయన. కార్యక్రమానికి జై భారత్ నేషనల్ పార్టీ ఉత్తరాంధ్ర కో - ఆర్డినేటర్ ఇంజరాపు జయదేవ్ సమన్వయకర్తగా వ్యవహ రించారు. కార్యక్రమంలో జై భారత్ పార్టీ అధికార ప్రతినిధి చౌదరి లక్ష్మణ్,శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు రాగోలు నాగశివ, పాతపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ బాలకృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments