సాపక్రింద నీరులా వెనుక బడిన ప్రాంతాల్లో దూకుడు చూపిస్తున్న జైభారత్ నేషనల్ పార్టీ..
పేదప్రజలకు ఉచిత విద్యుత్ , ఉచిత చదువులు మా ధ్యేయం.. నరేంద్ర ముప్పసాని..
కావలి కానుక ప్రతినిధి ముజీర్.
11-03-2024
ఒకప్పుడు సి.బి.ఐ అధికారిగా అవినీతి చక్రవర్తుల గుండెల్లో సింహస్వప్నంలా ఒక్కొక్కరిని ఉరకలు పెట్టించి ఊచలు లెక్కపెట్టించిన జె.డి లక్ష్మీ నారాయణ ఇటీవల కాలంలో జైభారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. అందులో భాగంగా 2024 లో జరగబోయే ఎన్నికలకు 175 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో జైభారత్ నేషనల్ పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థిగా నరేంద్ర ముప్పసానిని ఖరారు చేయడం జరిగింది. కావలి నియోజకవర్గ ప్రజలకు తమపార్టీ చేస్తున్న సేవలు తెలిపేందుకు స్థానిక రైల్వే రోడ్డులోని జర్నలిస్ట్ క్లబ్ లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైభారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాకినేని అరుణ,రాష్ట్ర యువజన అధ్యక్షులు సిద్దెల సిద్దార్ధ మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం, ఉన్నతమైన లక్ష్యాలతో సమాజ మార్పుకోసం ప్రజలలో నుండి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని పేర్కొన్నారు.అదేవిధంగా పెట్టుబడి దారీ వ్యవస్థ, గూండాల కోసం జైభారత్ పార్టీ స్థాపించ బడలేదని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీ కి 1కోటి రూపాయలు,అర్హులైన ప్రతి ఒక్కరికీ 10 లక్షల భీమా, మధ్యతరహా మరియు చిన్న భారీ పరిశ్రమలు , మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని, ఆర్టీసీ ఉచిత ప్రయాణం,ముఖ్యమైన ఎ. పి ప్రత్యేక హోదా హక్కుల కోసం జై భారత్ పార్టీ పుట్టింది అని పేర్కొన్నారు. రాష్ట్రం లో అవినీతి, మత్తు పానీయాలు, రౌడీ మూకలను రూపు మాపడం, విద్వంసం లేని సమాజం కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కనుక అటువంటి పరిపాలన అందివ్వడం జై భారత్ నేషనల్ పార్టీ అజెండా అని తెలిపారు. కావలి నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోగా ఎక్కడి సమస్యలు అక్కడే వుండిపోవటం కావలి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని పాలక వర్గాలను విమర్శించారు. ముఖ్యంగా నీటి సమస్య,రోడ్డు, కాలువలు, ఆరోగ్యం,యువతకు ఉపాధి, వ్యవసాయ రంగం లో కనీస వేతనాలు లేక. నియోజకవర్గ ప్రజల బ్రతుకులు కష్టాల ఊబిలో మునిగిపోయాయని వారు ఆవేదన వ్యక్త పరిచారు. ఇప్పటికే కావలి నియోజక వర్గ ప్రజలు వరుసగా ఒకేవ్యక్తికి రెండుసార్లు శాసన సభ్యునిగా ఎన్నుకున్నారు.ఫలితం శూన్యం. అంతేకాకుండా భూకబ్జాలు, మైనింగ్ మాఫియాలు, ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం, ఎదురు తిరిగి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించి వారిపైనే అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ త్రిప్పడమే లక్ష్యంగా పరిపాలన సాగించడం జరుగుతోందని వాపోయారు. మరలా అటువంటి వారికి అవకాశం కల్పిస్తే నియోజక వర్గం సర్వనాశనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని అయిదు సంవత్సరాలకు ఒకసారి అవకాశంగా వచ్చే ఓటు అనే ఆయుధాన్ని డబ్బుకు తాకట్టుపెట్టి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రజలకు హితవు పలికారు. మరోసారి ఇలాంటి వారిని అధికారంలో ఉంచితే కావలి ప్రజల కష్టాలు తీర్చకుండనే కాల గర్భంలో కలుపుతారని ఆవేదన వ్యక్త పరిచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ప్రజల కోసం పనిచేసే .. జై భారత్ నేషనల్ పార్టీని ఆదరించి మీ అమూల్యమైన ఓటు హక్కు ను వినియోగించుకొని అభివృద్ధి కోసం ప్రజలు మేము సైతం అంటూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
Comments