జై భారత్ పామర్రు బర్రెలక్కగా శిరీషా
- యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
- జై భారత్ పార్టీ పామర్రు ఇన్ ఛార్జిగా నాయుడు శిరీషా రాణి
- వంద మంది మహిళలతో జేడీ సమక్షంలో జై భారత్ లో చేరిక
విజయవాడ : తెలంగాణా బర్రెలక్క శిరీషలా, పామర్రులో మరో శిరీషా ఎన్నికల బరిలో దిగుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నాయుడు శిరీషా రాణి అనే మహిళను జై భారత్ నేషనల్ పార్టీ ఎంచుకుంది. మొవ్వకు చెందిన గ్రాడ్యుయేట్ శిరీషా, వంద మంది మహిళలతో బుధవారం విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీలో చేరారు. బి.కాం, కంప్యూటర్స్ చదవిన శిరీషాను పామర్రు అసెంబ్లీ ఇన్ ఛార్జిగా నియమిస్తూ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలంగాణాలో బర్రెలక్కలా కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాయుడు శిరీషా రాణి, రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని చెప్పారు. పామర్రు నియోజకవర్గంలో సోషల్ వర్క్ లో ముందున్నశిరీషా రాణి, ఇపుడు జై భారత్ పార్టీ అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళతారని అన్నారు. మహిళల ఆర్ధిక స్వాలంబన కోసం జై భారత్ నేషనల్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఎన్నో అంశాలను చేర్చిందని, మద్య నిషేధాన్ని మహిళల చేతిలోనే పెట్టామని జేడీ పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయిస్తామని, దాని నియంత్రణ అధికారం స్థానిక సర్పంచి, ప్రజల చేతికే అందిస్తామన్నారు. మహిళల స్వావలంబనకు ప్రతి పంచాయతీలో పది కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని జైభారత్ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జై భారత్, రాష్ట్ర కోఆర్డినేటర్ రవికిరణ్, పామర్రు నియోజకవర్గం కో ఆర్డినేటర్ నాని తదితరులు పాల్గొన్నారు.
Comments