ప్రత్యేక హోదా కోసం జై భారత్ ఉద్యమపథం
విజయవాడ: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, ఆరంభం అని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మలి విడత ఉద్యమానికి ఎపుడో శ్రీకారం చుట్టారని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.రవికిరణ్ చెప్పారు.ప్రత్యేక హోదా ఆంధ్రల గుండె చప్పుడని, దీనికోసం తమ పార్టీ తుది వరకు పోరాడుతుందన్నారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం జరిగింది. ఇందులో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రవికిరణ్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆకురాతి వెంకట అశ్విని పాల్గొని తమ పార్టీ విధానాన్ని తెలియజేశారు. ప్రత్యేక హోదాపై ఈ నెల వరకు విధించిన డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలో ఇక ఉద్యమం విద్యార్థులు, మహిళల చేతుల్లోకి వెళుతుందని అన్ని పార్టీల తరఫున చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, హోదా, విభజన హామీల సాధనకు సిద్ధం కావాలని డిమాండు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేయాలని, విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జైభారత్ పార్టీ ప్రతినిధులు రవికిరణ్, అశ్వినిలు తమ పార్టీ సైతం ప్రత్యేక హోదా కోసం అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్, ఆమ్ ఆద్మీపార్టీ నాయకులు ఫణిరాజ్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
Comments