పశ్చిమకు పూర్వ వైభవం తెస్తా...
అయిదేళ్ళలో వన్ టౌన్ రూపురేఖల్నిమార్చేస్తా
ఎవరికి ఓటేసినా, చేరేది పువ్వుకే...ఓటర్లు గమనించాలి
- జైభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు
విజయవాడ: పశ్చిమ సమగ్ర అభివృద్ధే జైభారత్ లక్ష్యం అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు చెప్పారు. దీని కోసం తమ పార్టీ నియోజకవర్గానికి ఏటా వంద కోట్లు కేటాయిస్తూ, అభివృద్ధి మేనిఫెస్టోని రూపొందించిందని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆర్ధిక నిపుణులతో చర్చించి, విడుదల చేసిన పీపుల్స్ మ్యానిఫెస్టోకి ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని పోతిన రాము వెల్లడించారు. విజయవాడలోని చిట్టినగర్లో జైభారత్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపెయిన్ కార్యాలయాన్ని పోతిన వెంకట రామారావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 1940 దశకంలోనే వ్యాపార కూడలిగా భాసిల్లిన వన్ టౌన్ నేటికీ ఆశించిన అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వలనే పశ్చిమ అభివృద్ధి సాధ్యం కాలేదని, దీనిని జైభారత్ అయిదేళ్లలో చేసి చూపిస్తుందన్నారు. తాము పశ్చిమను వ్యాపార కూడలిగా తీర్చిదిద్దుతామని, వర్తక, వాణిజ్య, కార్మిక వర్గాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తామన్నారు. దీనికోసం తాను ప్రత్యేక ప్రణాళికను రూపొందించానని పోతిన రాము చెప్పారు. స్మార్ట్ డ్రైనేజీ సిస్టం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు, భద్రత, తాగునీరు, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. రాజకీయంగా పశ్చిమలో కూటమిని ఎదుర్కోడానికి జైభారత్ సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసింది, ఆ నాలుగు పార్టీలేనని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ, జనసేనలో దేని ఓటు చేసినా, అది చేరేది ఒక్కశాతం కూడా లేని బీజేపీకే అని, దీనిని ఓటర్లు అర్ధం చేసుకోవాలని పోతిన వెంకట రామారావు కోరారు.
Comments