జై భారత్ పార్టీ బలం ప్రజా మ్యానిఫెస్టో
భారీ ర్యాలీతో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము నామినేషన్
విజయవాడ: ప్రజా మ్యానిఫెస్టో జై భారత్ పార్టీ బలం అని, దీనిని తమ పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి ప్రజారంజకంగా రూపొందించారని జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు చెప్పారు. పోతిన రాము మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీలకు భిన్నంగా క్రమశిక్షణతో జనమంతా రెండు వరుసల్లో బారులు తీరగా, మధ్యన పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ బ్యానర్లతో పోతిన రాము తన నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు చిట్టినగర్ కొత్త అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన రాము, అక్కడి నుంచి ర్యాలీగా, చిట్టినగర్, పోతిన రామారావు రోడ్డు, బ్రాహ్మణవీధి, రథం సెంటర్, దుర్గగుడి మీదుగా భవానీపురం ఆర్.ఓ. కార్యాలయానికి చేరారు. మధ్య మధ్యలో ఆయన ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ, జైభారత్ మ్యానిఫెస్టోని విరించారు. తాను ఎన్నిక అయితే, విజయవాడ పశ్చిమ రూపురేఖలను మారుస్తానని, నియోజకవర్గాన్ని ఏటా వంద కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవానీపురం ఆర్.ఓ. కార్యాలయం చేరుకుని తన నామినేషన్ దాఖలు చేశారు. జైభారత్ పార్టీ లీగల్ ప్రెసిడెంట్ మహంత్ నాయర్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం అభ్యర్థి పోతిన రాము మీడియాతో మాట్లాడుతూ, జేడీ లక్ష్మీనారాయణ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో బలంతో, పశ్చిమలో తనకున్న బలంతో జైభారత్ జయకేతనం ఎగురవేస్తామన్నారు. పశ్చిమలో ప్రగతికి తాను ప్రత్యేక ప్రణాళికతో ఉన్నానని, స్థానికుడిగా తనకు ఇక్కడి సమస్యల్నీ తెలుసని పోతిన రాము చెప్పారు. ముఖ్యంగా తాను కొండ ప్రాంతవాసులకు పట్టాల సమస్య, శానిటేషన్, మెట్ల మార్గం అభివృద్ధిపై దృష్టి పెడతానని పోతిన వెంకట రామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జైభారత్ అధికార ప్రతినిధి కొడాలి ఏకాంబరం, రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, క్యాంపెన్ ఇన్ ఛార్జి యెన్నేటి మహేష్, తమ్మిన శ్రీనివాస్, రాయన మణి, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Comments