pvrమెట్లు లేవు, మెట్రో రైలు లేదు... బుల్లెట్ ట్రైన్ తెస్తారట!
- ప్రధాని టూర్ తో ఒరిగిందేమిటి? పవన్ ఒంగి ఒంగి దండాలేంటి?
- పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు
- పశ్చిమలో జైభారత్ బ్యాటరీ టార్చ్ భారీ రోడ్ షో
విజయవాడ: మెట్లు లేవు, మెట్రో లేదు గాని, బుల్లెట్ ట్రైన్ గురించి ప్రధాని మోదీ చెప్పుకొస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమలోని కొండ ప్రాంతవాసులకు మెట్లు కూడా సరిగా లేవని, ఇక ఎక్కడా మనకి మెట్రో రైలు కూడా లేదన్న విషయాన్ని ప్రధాని మరిచారన్నారు. ప్రధాని మోదీ బుల్లెట్ ట్రైన్ కావాలా? అంటే, అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ చెరో పక్కా చేరి డింగ్ డాంగ్ లా చిడతలు వాయిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో గురువారం జై భారత్ రోడ్ షో నిర్వహించింది. నగరంలోని రధం సెంటర్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా, చిట్టినగర్ వరకు బ్యాటరీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామరావు మాట్లాడుతూ, విజయవాడకు ప్రధాని మోదీ వచ్చి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. అమరావతి ప్రకటించారా? ప్రత్యేక హోదా ప్రకటించారా? మరి దేని గురించి పవన్ కల్యాణ్, చంద్రబాబు దండాలు పెడుతున్నారని విమర్శించారు. అటు జగన్, ఇటు చంద్రబాబు, పవన్ అంతా కలిసి ఏపీ ప్రయోజనాలకు పణంగా పెట్టారని ఆరోపించారు. జైభారత్ బ్యాటరీ టార్చ్ ని గెలిపిస్తే, తాను వన్ టౌన్ లోని కొండప్రాంత వాసులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తానని, కొండ మెట్లు పునర్ నిర్మిస్తామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీలు దొందూదొందేనని, వీటికి ప్రత్యామయంగానే జైభారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రజా క్షేత్రంలోకి వచ్చిందన్నారు. జైభారత్ రోడ్ షోలో పోతిన రాముతోపాటు కార్మిక నాయకుడు బూరాడ యజ్ణ్ననారాయణ, జైభారత్ లీగల్ సెల్ అధ్యక్షుడు మహంత్ నాయర్, బెజవాడ నాని, పోతిన శ్రీనివాసరావు, రాయన మణి, తదితరులు పాల్గొన్నారు.
Comentarios