మహిళలు వద్దంటే, ఆ గ్రామంలో నో వైన్ షాప్.
- మహిళా సమస్యలపై జై భారత్ పోరాటం
- జై భారత్ మ్యానిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం
జై భారత్ అధ్యక్షుడు వి.వి. (జేడీ) లక్ష్మీనారాయణ, మహిళా ఐక్యవేదిక వినతి.
విజయవాడ : జై భారత్ నేషనల్ పార్టీ మ్యానిఫెస్టోలో మహిళల అభ్యున్నతికి, ఆర్ధిక స్వావలంబన, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఆ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ చెప్పారు. విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అధ్యక్షుడు లక్ష్మీనారాయణను మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కలిసి మహిళా సమస్యలపై చర్చించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, ఎస్.ఎఫ్.ఐ.డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గా భవాని, పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు పి.పద్మ తదితరులు జేడీ లక్ష్మీనారాయణకు తమ మెమోరాండం సమర్పించారు. మహిళల రక్షణ, హింస, మహిళా సాధికారత, మహిళల దుస్థితిలో మార్పు వంటి అంశాలను అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలలో చేర్చాలని కోరారు. మద్యం, మత్తు పదార్ధాల నివారణ, ధరల నియంత్రణ, విద్య, ఆరోగ్యం, వృద్ధులు, ఒంటరి మహిళల సంక్షేమం వంటి అంశాలపై పార్టీలు పోరాడాలని కోరారు. దీనిపై స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ, తమ జైభారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశామని మహిళా ప్రతినిధులకు వివరించారు. మద్య నిషేధం మహిళల చేతుల్లోనే ఉంచుతున్నామని, ఆమె వద్దు అంటే, ఇక ఆ గ్రామంలో మద్యం వద్దే వద్దని తమ మేనిఫెస్టోలో తెలిపామన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆస్తిగా టేకు, ఎర్రచందనం చెట్టు పెంచి, వారి 18 ఏట ఆదాయాన్ని అందించే పథకాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. డ్వాక్రా సంఘాల కార్పొరేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని వివరించారు. మహిళా సంఘాల ఐక్యవేదికకు జైభారత్ నేషనల్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జైభారత్ లీగల్ వింగ్ ప్రధాన కార్యదర్శి బి.వి.అరుణ, ఎన్టీయార్ జిల్లా కన్వీనర్ బి. సత్య వసుంధర, కార్యదర్శి ఎం. అరుణ, రాజమండ్రి కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Commentaires